తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘాటు వాసన ఎక్కడి నుంచో తేల్చి వెంటనే నోటీసులిస్తారు - new method to recognise air pollution in hyderabad

వాయుకాలుష్యంపై ఫిర్యాదు అందగానే అక్కడికక్కడే దోషులెవరో తేల్చేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆన్‌లైన్‌ మొబైల్‌ ప్రయోగశాలను రంగంలోకి దించనుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే వాటి పనితీరు పరిశీలించారు. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో అందుబాటులోకి రావచ్చని అధికారవర్గాలు అంటున్నాయి.

air pollution report results wthin an hour
ఘాటు వాసన ఎక్కడి నుంచో తేల్చి వెంటనే నోటీసులిస్తారు

By

Published : Aug 4, 2020, 1:00 PM IST

వాతావరణంలోకి విష వాయువులను వదులుతూ ప్రజారోగ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉల్లంఘనుల ఆట కట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) సమాయత్తమవుతోంది. ఫిర్యాదు అందగానే అక్కడికక్కడే దోషులెవరో తేల్చేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆన్‌లైన్‌ మొబైల్‌ ప్రయోగశాలను రంగంలోకి దించనుంది. రూ.1.5 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో అందుబాటులోకి రావచ్చని అధికారవర్గాలు అంటున్నాయి.

నివేదికొచ్చేలోపే సర్దేస్తున్నారు..

ఉత్పత్తి సమయంలో వెలువడే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాలను కొన్ని పరిశ్రమలు నాలాలు, పరిసరాల్లోకి వదిలేస్తున్న విషయం తెలిసిందే. మరికొందరు విష వాయువులను గాల్లోకి వదులుతున్నారు. దీనివల్ల స్థానికులు రోగాలబారిన పడుతున్నారు. ఫిర్యాదు చేస్తే పీసీబీ అధికారులొచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అక్కడ యంత్రాలతో నమూనాలను సేకరించి ప్రయోగశాలకు తీసుకెళ్లి పరీక్షించి నివేదిక ఇచ్చేందుకు 24 గంటల నుంచి 36 గంటల సమయం పడుతోంది. ఆ లోపు అక్కడి పరిస్థితి మారిపోతుంది. క్షేత్రస్థాయి సిబ్బందితో కుమ్మక్కై ఉల్లంఘనులు అప్పటికే అంతా సర్దుకుంటున్నారు.

గంటలోపే ఫలితం..

ప్రతిచోట వాయు కాలుష్య నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం భారీ వ్యయంతో కూడిన వ్యవహారం. ఈ తరుణంలో ఎక్కడికైనా వెళ్లేలా ఆన్‌లైన్‌ మొబైల్‌ ప్రయోగశాల ఉపయోగపడుతుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే వాటి పనితీరు పరిశీలించారు. మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రూ.1.5 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫిర్యాదు అందిన గంటలోపు ఈ వాహనం అక్కడికి చేరుకుంటుంది. పీఎం 10, పీఎం 2.5 తదితర కాలుష్య ఉద్గారాలను అక్కడికక్కడే లెక్కిస్తుంది. ఆ సమాచారం తెరపై కనిపిస్తుంది. ఘాటు వాసనలు ఎటు నుంచి వస్తున్నాయో గుర్తించి ఆరోగ్యానికి హానికరమా లేదా అన్నది తేల్చుతారు. స్థానికులు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తారు. కారణమైన పరిశ్రమను గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details