ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆసరా పింఛన్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మొత్తం జూన్ నెల నుంచి అమల్లోకి రానుండగా... లబ్ధిదారులకు జూలైలో అందనుంది. వృద్ధాప్య పెన్షన్ల అర్హతా వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 ఏళ్లకు కుదించనున్నట్లు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్లో ఆసరా పథకానికి నిధులు కూడా కేటాయించారు. గతంలో ఆసరాకు ఏడాదికి 5 వేల కోట్ల రూపాయలు కేటాయించగా... ఈ మారు ఏకంగా 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వృద్ధాప్య పెన్షన్ల అర్హతా వయస్సు తగ్గించిన నేపథ్యంలో అదనంగా లబ్ధి పొందే వారి జాబితా తయారీ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రారంభించింది.
గ్రేటర్లో కొనసాగుతున్న కసరత్తు!
2018 నవంబర్ 19వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకున్న అధికారులు పూర్తిస్థాయిలో వడబోసి కొత్త లబ్ధిదారులను గుర్తించారు. గ్రేటర్లో కొత్త లబ్ధిదారుల సంఖ్య ఇంకా తేలాల్సి ఉండగా.. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలో కసరత్తు కొనసాగుతోంది. గ్రేటర్లోనూ ఈ గుర్తింపు పూర్తయితే... వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారుల వయస్సును కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.