Neera Cafe in Hyderabad: నీరా.! గ్రామీణ ప్రాంతాల వారికిది సర్వసాధారణమే. కానీ, హైదరబాద్ వాసులకు మాత్రం ఇది కొత్త అనే చెప్పొచ్చు. అలాంటి వారికి నీరాను పరిచయం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందుకు ప్రశాంతమైన హుస్సేన్ సాగర్ తీరాన్ని అనువైన ప్రాంతంగా భావించిన సర్కారు.. రూ.13 కోట్ల వ్యయంతో అత్యంత ఆకర్షణీయంగా నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసింది. దీనిని గ్రామీణ వాతావరణానికి ఏ మాత్రం తీసిపోకుండా నిర్మించారు.
అచ్చం గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు: పైకప్పును తాటాకు ఆకారంలో తీర్చిదిద్దారు. కేఫ్ చుట్టూ తాటి చెట్ల నమూనాను ఏర్పాటు చేసి.. కేఫ్‌లో కూర్చున్న వారికి పొలాల్లో కల్లు తాగే అనుభూతిని పంచేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్లు సేవించే ప్రాంతాన్ని మండువా అంటారు. అచ్చం అలాంటి ఏర్పాట్లే ఇక్కడ చేశారు. గ్రామాల్లో తాళ్లు, ఈదుల్లో కూర్చొని కళ్లు తాగిన అనుభూతి పొందేందుకు.. తాటి, ఈత మొద్దుల నమూనాల్లో సీట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేఫ్ చుట్టూ తాటి చెట్లు.. వాటికి మట్టి కుండలు కట్టి అచ్చం గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు.
గౌడ కులస్థులకు తాటి, ఈత చెట్ల నుంచి కల్లు సేకరించడం.. దానిని విక్రయించడం ప్రధాన జీవనాధారం. అందులో భాగంగా నీరాను కూడా తీస్తారు. తాటి, ఈత, కొబ్బరి చెట్లతో పాటు.. ఖర్జూర, జీలుగ చెట్ల నుంచి నీరాను సేకరిస్తారు. సాధారణంగా.. తాటి, ఈత చెట్లకు.. కొంత నీరు, మడ్డి కలిపిన కుండను చెట్టుకు కట్టడం వల్ల కల్లు వస్తుంది. నీరాను మాత్రం కొత్తకుండలో ఎలాంటి నీరు.. మడ్డీ వేయకుండా తాజాగా తయారు చేస్తారు.
నీరాకు తక్కువ షెల్ఫ్ లైఫ్:నీరాకు తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉటుంది. 4 డిగ్రీల వద్ద ఉంచితే.. ఇది ఐదు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పటి వరకు కంబోడియా, ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో నీరా ఉత్పత్తి అధికంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణాలో కూడా ఆస్థాయికి నీరా ఉత్పత్తి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఏ చెట్టు నుంచి తయారు చేసిన నీరా అయినా అద్భుతమైన రుచితో పాటు.. అందులో పోషకాలు కూడా ఉంటాయని గౌడ కులస్తులు పేర్కొంటున్నారు.
నీరా.. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ప్రొటీన్, షుగర్, విటమిన్-సి కలిగి ఉంటుందని.. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైందని వారు అభిప్రాయపడుతున్నారు. వ్యాధులను నివారించే ఔషధ గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాల్లో తేలినట్లు చెబుతున్నారు. ఇది శరీర అంతర్గత ప్రక్షాళన చేసే యంత్రాంగాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉందని, షుగర్, కాలేయం, గుండె సమస్యల వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
నీరాలో అనేక ఔషధ గుణాలు: నీరాలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా తెలిపాయి. కేన్సర్ సహా 18 అనారోగ్య సమస్యలకు నీరా పరిష్కారం చూపుతుందని గౌడ కులస్థులు తెలిపారు. నెక్లెస్ రోడ్ ఏర్పాటు చేసిన కేఫ్‌కు రాష్ట్రంలోని 4 ప్రధాన కేంద్రాల నుంచి నీరాను సేకరించనున్నట్లు వారు చెబుతున్నారు. చెట్ల నుంచి వేకువజామునే లభించే నీరాను రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తారు.