TS Group 1 posts: తెలంగాణ తొలి గ్రూప్-1 ఉద్యోగ ప్రకటన మహిళలకు సువర్ణావకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లకు మించి తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో 225 పోస్టులు అతివలకు లభించనున్నాయి. కొన్ని కేటగిరీల్లో జనరల్ కన్నా మహిళలకు రిజర్వు అయిన పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. మల్టీజోన్-1లో 107, మల్టీజోన్-2లో 118 పోస్టులు రిజర్వు అయ్యాయి. పరిపాలన విభాగంలో కీలకమైన రెవెన్యూలోని డిప్యూటీ కలెక్టర్ కేటగిరీలో జనరల్ కన్నా మహిళలకు పోస్టులు ఎక్కువ. డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42 ఉంటే, వీటిలో 22 మహిళలకు రిజర్వు అయ్యాయి. మిగతా 20 జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఆవిర్భావమయ్యాక ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులకు మొదటి రోస్టర్ నుంచి తీసుకుని రిజర్వేషన్ కల్పించారు. 2018లో రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు వచ్చాయి. ఉమ్మడి పది జిల్లాలు 33 జిల్లాలుగా మారాయి. రెండు జోన్లు ఏడు జోన్లుగా అయ్యాయి. ఒక మల్టీజోన్ రెండు మల్టీజోన్లుగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు, కొత్తజోన్లు, మల్టీజోన్లు రావడంతో మళ్లీ రోస్టర్ 1 నుంచి లెక్కించింది. అయితే 2018లో రాష్ట్రపతి ఉత్తర్వుల కన్నా ముందు గ్రూప్-1లో మంజూరైన 137 పోస్టులను ప్రస్తుత మల్టీజోన్-1, 2 కింద ఆయా కేటగిరీలకు మార్చింది. గతంలో భర్తీకాకుండా మిగిలిన బ్యాక్‌లాగ్ పోస్టులను ఆయా రిజర్వు కేటగిరీలకు క్యారీ ఫార్వర్డ్ చేసింది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల తరువాత రోస్టర్ 1 నుంచి తీసుకుని ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసింది.