National Kisan Mela: "రైతులు - మార్కెటింగ్ వ్యవస్థ- వినియోగదారులు ”... ఈ ముగ్గురిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఆహార ఉత్పత్తుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచటమే లక్ష్యంగా హైదరాబాద్ హైటెక్స్ వేదికగా కిసాన్ ఎక్స్‌పో - 2022 జరగనుంది. గ్రామ భారతి స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం, గ్రామభారతి రజతోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ప్రదర్శనలో సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ సేవలందిస్తున్న కంపెనీలు, అంకుర సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చెందిన 130కి పైగా స్టాళ్లు కొలువు తీరనున్నాయి. దేశీయ విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు, యాంత్రీకరణ, సేంద్రీయ ఉత్పత్తులు, ఆహారశుద్ధి పరిశ్రమల నిర్వహణ, ఉద్యాన, పాడి, కోళ్ల పరిశ్రమ, మత్స్య రంగాల ఉత్పత్తులకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అధికారులు సహా 10 వేల మంది రైతులు, 50 వేల మంది వరకు వినియోగదారులు, కార్యకర్తలు ఈ ప్రదర్శనకు తరలిరానున్నారు. వ్యవసాయరంగాన్నిసేంద్రీయ విధానంలోకి తీసుకురావటం, ఆహార ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన కల్పించటమే లక్ష్యంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు గ్రామభారతి సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. రైతులకు, వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించటమే తమ సంస్థ లక్ష్యమని పేర్కొంటున్నారు.