Narendra Modi Letter to Gaddar Wife Vimala : ప్రజా యుద్ధనౌక గద్దర్ సతీమణి విమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi letter to Gaddar Wife Vimala ) లేఖ రాశారు. గద్దర్ మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఆయన పాటలు, ఇతివృత్తాలు.. సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని కొనియాడారు.
గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయని మోదీ వివరించారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో గద్దర్చేసిన కృషి.. ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మీ దుఃఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేనని.. కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు దీనిని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని మోదీ లేఖలో పేర్కొన్నారు.
Folk Singer Gaddar Biography :గద్దర్ ఆగస్టు 6న కన్నుమూశారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్య దంపతులకు 1949లో జన్మించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఎందుకు కావాలో చెబుతూ.. ఊరురా తిరిగి ప్రచారం నిర్వహించారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో బుర్రకథ వేదికగా ఎంచుకుని గద్దర్ పాటలు పాడారు.
దర్శకుడు బి.నరసింగరావు ప్రోత్సాహంతో 1971లో సినిమాల్లో తొలి పాట పాడారు. "ఆపార రిక్షా" రాశాడు. ఆయన తొలి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. తన పాటలతో తాడిత పీడిత, బడుగు బలహీన వర్గాలను మేల్కొలిపారు. మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో గద్దర్నటించారు. బండెనక బండి కట్టి అంటూ ఆడిపాడారు. తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు.