YUVAGALAM SECOND DAY PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు ఘనంగా సాగింది. అడుగడుగున మహిళల హారతులు, టీడీపీ శ్రేణుల కోలాహలం మధ్య పాదయాత్ర సాగించిన లోకేశ్.. వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. ఉదయం యువకులతో నిర్వహించాల్సిన ముఖాముఖి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఉదయం 9.45 నిమిషాలకు ప్రారంభించిన పాదయాత్ర.. వివిధ గ్రామాల మీదుగా శాంతిపురం వరకు సాగింది.
విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి:కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ ఏపీ ప్రభుత్వంలో తమకు సరైన వసతులు కల్పించడం లేదని లోకేశ్‍కు పలువురు విద్యార్ధులు విన్నవించుకున్నారు. విద్యాదీవెన ద్వారా తమకు రావాల్సిన నిధులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పిల్లలమైన తాము ఎలా చదువుకోవాలని లోకేశ్ ముందు వాపోయారు. బస్సులు ఏర్పాటు చేయలేదని.. తాగునీటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి రాగానే విద్యార్థులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చిత్తూరు, తిరుపతిలో వేల ఉద్యోగాలు కల్పించే అమరరాజాను తరిమేశారని ఆయన ఆరోపించారు.
రైతులకు గ్రాస్కట్టర్ల పంపిణీ: పాదయాత్ర శాంతిపురం మండలం గణేశపురం క్రాస్‌కు చేరుకున్న అనంతరం రైతులు, గ్రామస్థులతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఎన్బీకే టు ఎన్టీఆర్ ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో రైతులకు గ్రాస్ కట్టర్లను ఆయన పంపిణీ చేశారు. కమీషన్ల కోసమే కరెంటు మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కరెంట్ మీటర్ల ఏర్పాట్లపై చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.