వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సర్కార్ సిద్ధమవుతోంది. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ ప్రక్రియ పూర్తిచేసేలా పురపాలకశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. వ్యవసాయేతర ఆస్తుల కొనుగోలు, వారసత్వం, వాటా పంపిణీ బహుమతి, తనఖా, కోర్టు, డిక్రీ ద్వారా ధరణి వేదికగా పురపాలక, నగరపాలక సంస్థల దస్త్రాల్లో పేరు మార్చేందుకు.... తాజాగా నిబంధనలను నిర్దేశించింది.
నాలుగు రోజులే గడువు..
ఒకరి పేరుతో బదలాయించేందుకు బకాయిలు లేవు అనే ధ్రువీకరణ పత్రం తప్పనిసరని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ జరిగే సమయానికి పురపాలక సంఘం లేదా నగరపాలక సంస్థ, విద్యుత్ సంస్థ నుంచి తీసుకున్న నో డ్యూ పత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుందని ఉత్వరుల్లో పేర్కొంది. సదరు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసేందుకు... ఆయా సంస్థలకు నాలుగు రోజుల గడువు ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్న నాలుగు రోజుల్లో ఇవ్వని పక్షంలో ఎలాంటి బకాయిలు లేవని భావించాల్సి ఉంటుందని పేర్కొంది.
వ్యవసాయేతర ఆస్తుల దస్త్రాల్లో సదరు యజమాని పేరు, కుటుంబంలో వారసుల పేర్లు, ప్రాంతం, ఆస్తి, విస్తీర్ణం తదితర వివరాలు ఇప్పటికే పొందుపరిచినట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ధరణి పోర్టల్లో నమోదైన ఆస్తి హక్కుకు సంబంధించి తాజా సమాచారంతో కూడిన దస్త్రాలు పురపాలక సంఘం లేదా నగరపాలక సంస్థలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పురపాలక సంఘం ఆస్తి పన్ను నిర్ధారణకూ వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.
నో డ్యూ..
భవన నిర్మాణ అనుమతి, ఆక్యూపెన్సీ సర్టిఫికేట్, ప్లాట్లు, లేఅవుట్‌ల అనుమతికి కూడా ధరణి పోర్టల్‌ను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే సంబంధిత నగర పాలక సంస్థ లేదా పురపాలక సంఘం నుంచి నో డ్యూ సర్టిఫికేట్ పొందిన తర్వాత.. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ కోసం తేదీ, సమయాన్ని కేటాయిస్తున్నారు. తర్వాత నిర్దేశించిన సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. తనఖా అయితే ధరణి పోర్టల్ రికార్డుల్లో మార్పులను నమోదు చేస్తారు.
ఇవీచూడండి:పుంజుకున్న ‘ధరణి’ సేవలు.. నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్