గతేడాది నగరంలో తలెత్తిన వరద సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆక్రమణల చెరలో కూరుకుపోతున్న బుల్కాపూర్ నాలా పరిస్థితిని ‘ఈనాడు-ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఓఆర్‌ఆర్(OUTER RING ROAD) వెలుపలి నుంచి మణికొండ మల్లన్నస్వామి గుట్ట వరకు నాలా ప్రవాహ మార్గం అస్తవ్యస్తంగా మారింది. మధ్యలో వెంచర్లు వచ్చాయి. అక్కడి నుంచి చిత్రపురి కాలనీ సమీపంలోని ఎల్లమ్మ చెరువు వరకు ఆక్రమణదారులు నాలాను మట్టితో పూడ్చేసి రోడ్లు వేసుకున్నారు. ఎల్లమ్మ చెరువు నుంచి రాయదుర్గం వరకు నాలా సాఫీగా సాగుతుంది. అక్కడున్న డైవర్షన్ ఛానెల్(Diversion Channel)ను దాటుకుని ఓయూకాలనీ మీదుగా షేక్‌పేట వైపు ప్రవహించేటప్పుడు ఆటంకాలు వచ్చాయి. ఓయూకాలనీలో నాలా 20-30అడుగుల లోతున ప్రవహిస్తుంది. అక్కడ విశాలమైన బఫర్ జోన్(Buffer Zone) ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతంలో నిర్మాణాలొచ్చాయి.
షేక్‌పేట గ్రామంలోకి ప్రవేశించగానే మరో భారీ నిర్మాణ ప్రాజెక్టు బఫర్‌జోన్(Buffer Zone)ను ఆక్రమించింది. అల్‌హమ్రా కాలనీలో నాలాలోకి నిర్మాణాలు చేపట్టారు. షేక్‌పేట శ్మశానవాటిక వద్ద రెండు అడుగులకు కుంచించుకుపోయింది. వివేకానందనగర్ కాలనీలోనూ మొత్తం నిర్మాణాలే. షేక్‌పేట నాలా రోడ్డును దాటుకుని లక్ష్మీనగర్‌లోకి ప్రవేశించగానే.. సగ భాగం కబ్జాకు గురైంది. బస్తీ వెలిసింది. లక్ష్మీనగర్ నిర్మాణాలూ నాలాలోకి వెళ్లాయి. ఇలా వెళ్లిన వరదంతా షేక్‌పేట కొత్తచెరువులో కలుస్తోంది. కొత్తచెరువు తూము నుంచి మళ్లీ బల్కాపూర్ నాలా ప్రయాణం మొదలవుతుంది. ఎంజీ నగర్, షేక్‌పేట హకీంషా విరాఠ్‌నగర్, బృందావన్‌కాలనీ, ఫాతిమానగర్, హకీంపేట, టోలిచౌకీ నిజాంకాలనీ, ఆర్మీ స్థావరం, పోచమ్మబస్తీ, ఫించన్ ఆఫీసు, చింతలబస్తీ, ఖైరతాబాద్, మారుతీనగర్ మీదుగా వెళ్లి హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుంది. ఈ మధ్యలో పరిస్థితి అధ్వానంగా ఉంది. హకీంపేట, టోలిచౌకీ ప్రాంతాల్లో పలు చోట్ల వెడల్పు ఐదు నుంచి మూడు అడుగులకు కుదించుకుపోతోంది.