NABARD officers protest: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని నాబార్డు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఎదుట అఖిల భారత నాబార్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్, అఖిల భారత విశ్రాంత అధికారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ - డీఎఫ్ఎస్, జారీ చేసిన ఉత్తర్వులకు నిరసనగా ఆందోళన చేపట్టారు.
వేతన సవరణ, భవిష్యత్తుకు చిక్కులు కలిగిస్తున్నందున విశ్రాంత సిబ్బంది, అధికారులకు మద్ధతు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబరు 14న డీఎఫ్‌ఎస్ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి నాబార్డు అధికారులు ఆందోళన చేపడుతున్నారు. ఆ ఉత్తర్వులు అమలు చేయాలని సెప్టెంబరు 21న అడ్మినిస్ట్రేటివ్ సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో గత రెండు నెలలుగా డీఎఫ్ఎస్ అధికారులతో అనేక ప్రాతినిధ్యాలు, రౌండ్ల సంభాషణలు జరిగినా సత్ఫలితాలు రాలేదు. అనంతరం పార్లమెంటుకు మార్చ్, నిరాహార దీక్షతో సమ్మె చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని ఏఐఎన్‌బీఓఏ నేతలు ఆక్షేపించారు.