సోనూ సూద్.. కరోనా వేళ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్నాడు..! ఒక్క చిన్న ట్వీట్ చేస్తే చాలు.. దేశంలో ఏ మారుమూల ప్రాంతమైనా స్పందించాడు.. స్పందిస్తూనే ఉన్నాడు..! సామాన్యుడి నుంచి స్టార్ల(హీరో, క్రికెటర్లు) వరకూ ఎవరూ సాయం అడిగినా.. తన వంతు ఏదో ఒకటి చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు సోనూ భాయ్..! లాక్డౌన్ వేళ సొంత ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలు పడ్డ.. ఎంతోమంది అభాగ్యులను వారి ఇళ్లకు చేర్చి ఆపద్భాంధవుడు అయ్యాడు ఈ బాలీవుడ్ నటుడు..! సెకండ్ వేవ్‌లోనూ తన వంతు కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. తనకు ఆంధ్రా, తెలంగాణ అంటే రెండో ఇల్లు లాంటివి అంటూ తెలుగు రాష్ట్రాలపై ఆయనకున్న ప్రేమను చాటాడు.
ఆంధ్రా అల్లుడిని..
దేశానికి కరోనా విసురుతున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అన్న అంశంపై.. వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులతో తెదేపా అధినేత చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు సోనూసూద్‌తో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనూసూద్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను ఆంధ్రా అల్లుడినే.. నా భార్య గోదావరి ప్రాంతానికి చెందిన అమ్మాయి కావటంతో.. ఈ ప్రాంతాలతో నాకు ఏదో తెలియని బంధం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ తనకి రెండో ఇల్లు లాంటిందని ప్రస్తావించాడు.