తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపాలక రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ - తెలంగాణ పురపాలక ఎన్నికలు

పురపాలక రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పదవుల్లో పాగా వేయాలనుకుంటున్న నేతలు, ఆశావహులకు రిజర్వేషన్లు గుబులు పుట్టిస్తున్నాయి. మేయర్, ఛైర్ పర్సన్లు, వార్డుల పదవుల రిజర్వేషన్లు ఖరారైతే అందుకు అనుగుణంగా కార్యచరణ రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

municipal elections reservations
పురపాలక రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ

By

Published : Jan 2, 2020, 4:46 AM IST

Updated : Jan 2, 2020, 10:31 AM IST

పురపాలక రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ

పురపాలక ఎన్నికల కోసం వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తైతే కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఏ పదవి ఎవరికి రిజర్వ్ అవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. దీని కోసం గతంలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు రెండు దఫాలుగా సేకరించారు. రిజర్వేషన్ల ఖరారు కోసం పురపాలకశాఖ మార్గదర్శకాలు ప్రకటించింది.

జనాభా ప్రాతిపదికన ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు

కొత్త చట్టం ప్రకారం 50 శాతానికి మించకుండా బీసీ రిజర్వేషన్లు, జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. వార్డుల వారీ రిజర్వేషన్లను జిల్లాస్థాయిలో కార్పొరేషన్, మున్సిపాలిటీ యూనిట్​గా... మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్​గా ప్రకటిస్తారు.

లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు

కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 13 కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీలు ఉన్నాయి. 13 కార్పొరేషన్లు ఒక యూనిట్ గా మేయర్ పదవులకు రిజర్వేషన్ ఖరారు చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 13 కార్పొరేషన్లలోని మేయర్ పదవులను ఎస్సీ, ఎస్టీల శాతానికి అనుగుణంగా కేటాయిస్తారు. ఈ రెండు కేటగిరీలకు కనీస ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. యాభై శాతంలో మిగతా సీట్లను బీసీలకు రిజర్వ్ చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ సగం సీట్లను లాటరీ ద్వారా మహిళలకు కేటాయిస్తారు.

ఎన్నికలు జరగకపోయినా.. రిజర్వేషన్లు ఖరారు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​తో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. ఆ మూడు చోట్ల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మరో ఎనిమిది మున్సిపాల్టీల్లోనూ ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. అయినా అన్ని కార్పొరేషన్లు ఒక యూనిట్​గా మేయర్ పదవులు ఖరారు చేయాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని కార్పొరేషన్ల మేయర్ పదవుల రిజర్వేషన్లు త్వరలోనే తేలనున్నాయి. మున్సిపాలిటీల పరిస్థితి కూడా ఇదే. 128 మున్సిపాల్టీలు ఒక యూనిట్​గా ఛైర్ పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.

ఎవరికి దక్కేనో

ప్రస్తుతం ఎన్నికలు లేని పట్టణ, నగరపాలకసంస్థల మేయర్, ఛైర్ పర్సన్ల పదవుల రిజర్వేషన్లు కూడా త్వరలోనే తేలనున్నాయి. వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాతో పాటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను కూడా పూర్తి చేయాలని పురపాలకశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ కూడా నాలుగో తేదీన పూర్తి కానుంది. ఏ కేటగిరీకి ఎన్ని పదవులు దక్కుతాయన్న విషయమై అదే రోజు స్పష్టత రానుంది. మేయర్, చైర్ పర్సన్ల పదవుల పూర్తి స్థాయి రిజర్వేషన్లు ఐదో తేదీన, వార్డుల వారీ తుది రిజర్వేషన్లు ఆరో తేదీన ఖరారు చేస్తారు.

Last Updated : Jan 2, 2020, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details