ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, నగరపాలిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల్లూరు నగరపాలికతో పాటు, 12 పురపాలికల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఎస్ఈసీ ఓటేసే అవకాశం కల్పించింది. కాగా..మున్సిపల్, నగరపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 17న చేపట్టనున్నారు. ఏపీలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. నెల్లూరు నగరపాలికతో పాటు, కుప్పం, దాచేపల్లి, గురజాల, దర్శి, జగ్గయ్యపేట, కొండపల్లి, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, బేతంచర్లలో ఇవాళ పోలింగ్ జరిగింది.
పలు చోట్ల ఆందోళనలు
అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ యత్నించగా.. అక్కడే ఉన్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పార్థసారధి అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు సర్దిచెప్పి పంపించివేశారు. కుప్పం పురపాలక ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తున్న కొందరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. 18, 19 వార్డుల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తుండగా స్థానిక ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరు అనంతపురం జిల్లా రాయచోటి నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. కుప్పం ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పోలీసుల కాళ్లుపట్టుకున్నారు. 16 వ వార్డులో విజయవాణి పాఠశాలలో దాక్కున్న దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు వెళ్లిన తెలుగుదేశం కార్యకర్తలపైనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. 43వ డివిజన్‌లో పోలింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేత అబ్దుల్ అజీజ్‌ను వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకోగా.. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టడంతో సమస్య సద్దుమణిగింది.
కడపలోని కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. 9వ వార్డులో వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. మాచిరెడ్డిపల్లి నుంచి ర్యాలీగా వెళ్లిన తెదేపా నేతలు పుత్తా లక్ష్మీరెడ్డి, చైతన్యరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. స్థానికేతరులు కమలాపురంలో తిష్ఠవేసినా పట్టించుకోవట్లేదని.. వారిని మాత్రం అడ్డుకుంటున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో నగరపాలక ఎన్నికల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ పరిశీలనకు ఎంపీ విజయసాయిరెడ్డి రాగా... అక్కడే ఉన్న తెలుగుదేశం, జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పంపించి వేయాలని కోరగా... పోలీసులు వారిని పక్కకు తోసివేశారు. దీంతో వారంతా అక్కడే భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైకాపా: చంద్రబాబు