KomatiReddy Venkatreddy Interesting Comments: వరంగల్ సభలో రాహుల్‌గాంధీ చెప్పినట్లుగానే ఏ పార్టీతో మాకు పొత్తు ఉండదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ మాటలకే తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
తాను గందరగోళంలో ఏమి లేనని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సర్వేల ఆధారంగానే హంగ్ వస్తుందని చెప్పినట్లు వివరించారు. తానేమి తప్పుగా మాట్లాడలేదని, తనపై చిన్నపిల్లలు కూడా విమర్శలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హంగ్ ఏర్పడినప్పుడు సెక్యులర్ భావాలున్న పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కొట్టిపారేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏమి వ్యాఖ్యలు చూడలేదన్నారు.
ఇంతకీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు విషయం తెలిసిందే. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.