ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుపై ఏపీ సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. గౌరవ పార్లమెంట్ సభ్యుడిని లోక్సభ స్పీకర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడానికి అనుమతి ఉండదు అలాంటిది అరికాళ్లు కందిపోయేలా కొట్టడం దారుణమన్నారు. ఎంపీ కాళ్ల గాయాలు చూస్తుంటే ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు చాలా దుర్మారంగా కొట్టారని స్పష్టం అవుతోందని విమర్శించారు. సామాన్య పౌరులను కొట్టడానికే పోలీసులకు అధికారం ఉండదని... ఎంపీపై అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా?
ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? నియంతృత్వం కొనసాగుతుందా? అని మండిపడ్డారు. కేసు నిరూపించగలిగితే కోర్టు శిక్షవేస్తుందని... కానీ చట్టాన్ని చేతులోకి తీసుకొని ఎంపీపై విచక్షణా రహితంగా దాడి చేస్తారా అని ప్రశ్నించారు. కొందరి మెప్పుకోసం పోలీసులు ఎంపీపై అత్యంత కూర్రంగా వ్యవహరించినట్లు స్పష్టం అవుతోందని... అందరూ చట్టం పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, పాలకులు శాశ్వతం కాదని పోలీసులు గుర్తించుకోవాలని హితవు పలికారు. ఏంపీల హక్కులకు భంగం వాటిల్లితే పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు.