తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మో ఆన్​లైన్ చదువులు.. పేరెంట్స్​పై రూ.5500కోట్ల భారం

అప్పులు చేసైనా వేలల్లో ఫీజులు కట్టి ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పిల్లల్ని చదివిస్తున్న లక్షలాది మంది తల్లిదండ్రులపై ఈ ఏడాది మరింత ఆర్థిక భారం పడుతోంది. ఆన్​లైన్​ బోధన కోసం ఒక్కో కుటుంబం రూ. 20 వేల వరకూ అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఆన్‌లైన్‌ తరగతుల కోసం తల్లిదండ్రులపై కనీసం రూ.5,500 కోట్ల అదనపు భారం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

money leding increased due to online classes
ఆన్​లైన్​ క్లాసులకోసం అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు

By

Published : Jun 5, 2020, 10:00 AM IST

Updated : Jun 5, 2020, 11:23 AM IST

  • హైదరాబాద్‌ మల్కాజిగిరిలో నివాసం ఉంటున్న ఓ ప్రైవేట్‌ ఉద్యోగి నెల వేతనం రూ.18 వేలు. ఒకటో తరగతి చదవనున్న తన కుమారుడికి ఆన్‌లైన్‌ తరగతుల కోసం అప్పుచేసి రూ.20 వేలతో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేశారు.
  • హైదరాబాద్‌ శివారు కాటేదాన్‌కు చెందిన బుచ్చయ్య చిరు వ్యాపారి. ఆయనకు ముగ్గురు పిల్లలు. ప్రైవేట్‌ పాఠశాలలో 10, 7, 5 తరగతులు చదువుతున్నారు. గత నెలలోనే ఆ పాఠశాలలో 10వ తరగతికి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించగా రూ.15 వేలతో ట్యాబ్‌ కొనుగోలు చేశారు. ఇంటికి వైఫైతో నెట్‌ కనెక్షన్‌ తీసుకున్నారు. త్వరలో 7వ తరగతికి కూడా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తామని చెప్పడం వల్ల మరో ట్యాబ్‌ కొనక తప్పదని అన్నారు.

ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ బోధనను ప్రారంభిస్తున్నందున ఒక్కో కుటుంబం ట్యాబ్‌/ల్యాప్‌టాప్‌, వైఫై కనెక్షన్‌ కోసం సగటున రూ.20 వేల వరకూ అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కరోనాతో ఉద్యోగాలు, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండగా.. ఈ అదనపు ఖర్చు వారికి గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా మారింది. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న కుటుంబాల్లో ఆ భారం రెట్టింపు అవుతోంది. పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. జులైలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. అప్పటివరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఇప్పటికే చాలా పాఠశాలలు ప్రారంభించాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు అప్పుచేసి లేదంటే వాయిదాల పద్ధతిలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లు చేస్తున్నారు.

గత వారం రోజులుగా ల్యాప్‌టాప్‌ల కోసం తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు, వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఉద్యోగులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. పిల్లల కోసం రూ.20 వేల నుంచి రూ.35 వేల లోపు ల్యాప్‌టాప్‌లపై ఆసక్తి చూపుతున్నారు.

- త్రివిక్రమ్‌, లెనోవా సేల్స్‌ ప్రమోటర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌

రూ.వేల కోట్లు వ్యయం

రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో 30 లక్షల మంది చదువుతున్నారు. వారిలో సగం మందిని పక్కనపెట్టినా మిగిలిన 15 లక్షల మంది విద్యార్థులకు తల్లిదండ్రులు ట్యాబ్‌ లేదంటే ల్యాప్‌టాప్‌ కొననున్నారని అంచనా. ఒక్కో విద్యార్థికి రూ.20 వేల ఖర్చు లెక్కన మొత్తం వ్యయం రూ.3,000 కోట్లు అవుతుంది. బడ్జెట్‌ పాఠశాలలు కూడా ఆన్‌లైన్‌ పాఠాల మార్గం పడితే ఈ కొనుగోళ్లు ఇంకా పెరుగుతాయి. రాష్ట్రంలో ఇంటర్‌, ఆపై విద్యార్థులు రూ.23 లక్షల మంది ఉన్నారు. వారిలో సగం మంది వీటిని కొనుగోలు చేసినా దాదాపు రూ.2,500 కోట్లు అవసరం. అంటే ఈ ఏడాది ఆన్‌లైన్‌ తరగతుల కోసం తల్లిదండ్రులపై కనీసం రూ.5,500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.

25% తరగతులు ఆన్‌లైన్‌లో

రానున్న విద్యా సంవత్సరం(2020-21)లో 25 శాతం తరగతులు ఆన్‌లైన్‌లో బోధించాలని యూజీసీ కొద్ది రోజుల క్రితమే మార్గదర్శకాలు జారీచేసింది. అంటే డిగ్రీ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంటెక్‌, బీఈడీ తదితర ఉన్నత విద్యను అభ్యసించే వారు తప్పనిసరిగా అందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

  • రాష్ట్రంలో మొత్తం విద్యార్థులు: 72 లక్షలు
  • 1-10వ తరగతి చదువుతున్నవారు: 59 లక్షలు
  • వీరిలో ‘ప్రైవేట్‌’ విద్యార్థులు: దాదాపు 30 లక్షలు
  • ఇంటర్‌మీడియట్‌: 9.50 లక్షలు
  • డిగ్రీ: 6.50 లక్షలు
  • బీటెక్‌ విద్యార్థులు: 3 లక్షలు
  • ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంటెక్‌,
  • ఇతర కోర్సుల వారు: 4 లక్షలు
Last Updated : Jun 5, 2020, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details