MLA Tickets Fight In Congress : రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో టికెట్ల కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. తలపండిన పలువురు సీనియర్ నేతలు తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇతరులకు టికెట్లిస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరికలకు దిగుతున్నారు. గతంలో పోటీ చేసి, ఓడిన ఇలాంటి వారిలో కొందరికి టికెట్ ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో గెలిచే సత్తా లేదని పార్టీ ఆందోళన చెందుతోంది.
దాంతో తమ అనుచరులకైనా ఇప్పించుకోవడానికి మరికొందరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ (Telangana congress)లో చేరిన, చేరతారని ప్రచారం జరుగుతున్న కొందరు నేతలు కూడా టికెట్ల కోసం పట్టుబడుతున్నాయి. దీంతో పలు నియోజకవర్గాల్లోని సీనియర్లు అందుకు ససేమిరా అంటున్నారు. ఇంతకాలం పార్టీని కాపాడిన తమను వదిలేసి కొత్తవారికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
MLA Tickets Fight In Telangan Congress : ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి.. కొత్తగా పార్టీలో చేరిన ఓ నేత ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాల్లో తనవారికి టికెట్లు అడుగుతున్నారని.. ఆయన చెప్పిన వారికి టికెట్లిస్తే ఇంతకాలం పార్టీలో ఉన్నవాళ్లు ఏమవ్వాలంటూ అసహనం వ్యక్తం చేయటం పాత, కొత్త నేతల మధ్య పోటీని చాటుతోంది. నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదరరెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే స్థానంలో టికెట్ అడిగే విషయంపై తన అనుచరులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని నాగం తెలిపారు. కొల్లాపూర్‌లోనూ సీనియర్ నేత జగదీశ్వర్‌రావు టికెట్ ఆశిస్తున్నందున పార్టీ బుజ్జగింపు చర్యలు తీసుకుంది.
అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన జూపల్లి కృష్ణారావు రేసులో ఉన్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక జడ్చర్లలో సీనియర్ నేత వర్గానికి చెందిన మరొకరు పోటీకి రావడాన్ని మాజీ ఎమ్మెల్యే జీర్ణించుకోవడం లేదు. జోగులాంబ-గద్వాల నియోజకవర్గంలో కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేత టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని అక్కడున్న పాత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Telangana Assembly Election 2023 : జనగాయమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తనను సంప్రదించకుండా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి ఇవ్వడంపై.. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఏఐసీసీకే ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అక్కడ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ ఉండగా.. కొత్తవారికి ఎందుకిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు.