రాష్ట్ర శాసనసభలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే స్వల్ప అయోమయం చోటుచేసుకొంది. బ్యాలెట్ పత్రంపై ఓటు వేసిన అనంతరం కంపార్ట్మెంట్ వద్ద సీతక్క ఎక్కువ సమయం తీసుకున్నారు. అధికారులను ఏదో అడిగే ప్రయత్నం చేశారు. అది గమనించిన కాంగ్రెస్ ఏజెంట్ మహేశ్వరరెడ్డి.. ఏదైనా అనుమానం ఉంటే మరో బ్యాలెట్ పత్రం తీసుకోవాలని సూచించారు.
దీంతో సీతక్క మరో బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సహాయ రిటర్నింగ్ అధికారిని కోరారు. ఎన్నికల పరిశీలకుడు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఉన్నతాధికారులు ఈసీని సంప్రదించారు. ఆ సమయంలో సీతక్క అక్కడే నిరీక్షించారు. కొత్త బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో మొదటి బ్యాలెట్ పత్రాన్నే బ్యాలెట్ బాక్సులో వేశారు.
అయితే ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదని సీతక్క పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్‌పై ఇంక్ పడటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదని, ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్‌నే బాక్సులో వేసినట్లు తెలిపారు. ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేసినట్లు సీతక్క వివరించారు.