తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో బాజిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావించినా.. అనివార్య కారణాల వల్ల ఆ పదవి దక్కలేదని సమాచారం. దీంతో ఆయనను ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి యోచించినా.. మొదట్లో దీనికి బాజిరెడ్డి నిరాకరించారని తెలిసింది. తాజాగా ఆయన సీఎంను కలిసినప్పుడు ఈ అంశం చర్చకు రాగా ముఖ్యమంత్రి ఒప్పించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో జన్మించిన గోవర్ధన్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెరాస పార్టీ తరఫున 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.