ప్రతిష్ఠాత్మక మేడారం జాతరను ఘనంగా నిర్వహించేలా శాశ్వత ప్రాదిపదికన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. గద్దెల పరిసరాల్లో భక్తుల వసతులు, ఆర్టీసీ సేవలు, పోలీసు సిబ్బందికి అవసరమైన శాశ్వత నిర్మాణాల కోసం తొలిదశలో పదికోట్లతో భూసేకరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జాతరకు కోటి 40 లక్షలకుపైగా మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు, ముఖ్యంగా పోలీసు శాఖతో సమన్వయంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు.
సమగ్ర నివేదిక
జాతరలో కీలకమైన పారిశుద్ధ్యం, తాగునీటి కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని... మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేలా ఉండాలని ఆదేశించారు. జాతరకు కావాల్సిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను తయారు చేయాలని... వచ్చే నెలలో మరోమారు సమావేశమై ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్కు సమర్పించాలని తెలిపారు. మేడారం పూజారులు, ఆదివాసీల మనోభావాలు, సంప్రదాయాల ప్రకారం జాతరను నిర్వహించాలని స్పష్టం చేశారు. వారితో సంప్రదింపులు జరిపే బాధ్యతను ములుగు కలెక్టర్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓలకు మంత్రులు అప్పగించారు.