Ministers on Telangana Martyrs Memorial Day : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని.. పదో వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్సవాల్లో చివరి రోజైన.. నేడు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అమరుల త్యాగాలను ట్విటర్ వేదికగా స్మరించుకున్నారు.
KTR Tweet Today :ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతం.. ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికం తెలంగాణ సాధనోద్యమమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదని.. సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడమని తెలిపారు. దశాబ్దాలుగా పట్టిపీడించిన సకల దరిద్రాలను శాశ్వతంగా దూరం చేసి.. రాష్ట్ర సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించడమని కేటీఆర్ వెల్లడించారు.
అమరుల ఆశయాలే స్ఫూర్తిగా : అమరుల ఆశయాలే స్ఫూర్తిగా.. ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరిగా.. తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలు రాళ్లుగా.. రాష్ట్ర అభివృద్ధి సాగిందని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా తీర్చిదిద్దే మహాయజ్ఞం మహోద్యమంగా సాగిందనడానికి.. తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానమే నిలువెత్తు నిదర్శనమని స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే భారత స్వాతంత్ర్య పోరాట యోధుల కలలు.. 75 ఏళ్లు దాటినా నెరవేరలేదని కేటీఆర్ వివరించారు.