Ministers foundation stone in Hyderabad: బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కులవృత్తులకు చేయూతగా ఉచిత విద్యుత్తును అందించడమే కాక అత్మగౌరవ భవనాల కోసం అత్యంత ఖరీదైన కోకాపేట, ఉప్పల్ భగాయత్‌లో వేల కోట్ల విలువైన స్థలాలను కేటాయించిందని మంత్రి చెప్పారు. కోకాపేటలోని ఆరెకటిక, గాండ్ల, రంగ్రేజ్, భట్రాజ్ కులాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. బీసీల విద్య, ఉపాధి కల్పన, సంక్షేమానికి బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం కల్పించారని మంత్రులు తెలిపారు.
మంత్రి గంగుల కమలాకర్ ఏం అన్నారంటే?:ఈ నాలుగు భవనాలతో కలిపి ఇప్పటి వరకూ 29 ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన జరిగినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీల పట్ల ఆపేక్ష గల సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 41 బీసీ కులాలకు రూ.95.25 కోట్లు విలువ చేసే 87.3 ఎకరాలు కేటాయించారని ఆయన తెలిపారు. ఈ ఆత్మగౌరవ భవనాలను సైతం తమ కులం ఖ్యాతి ఇనుమడించేలా కట్టుకోవడానికి ఆయా సంఘాలకే అవకాశం కల్పించారని గుర్తుచేసారు. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.