Minister Talasani Srinivas Yadav on Dalit Bandhu: దేశ రాజకీయ చరిత్రను మార్చే గొప్ప కార్యక్రమం దళిత బంధు పథకమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా ఖర్చు చేయకుండా ప్రణాళికాబద్ధంగా లబ్ధిదారులు నగదును వినియోగించుకోవాలని సూచించారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం చేపడితే దానిపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక భారీ కార్యక్రమం చేపట్టినప్పుడు కొంత ఆలస్యం కావడం సహజమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ హరిహరకళాభవన్లో ఏర్పాటు చేసిన దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో మంత్రి తలసాని పాల్గొన్నారు.
"దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు దాటినా దళితులు అభివృద్ధికి నోచుకోలేదు. అంటరాని తనాన్ని రూపుమాపాలి... దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలి. వారిని అత్యున్నత స్థాయికి చేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయా రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మందికి దళితబంధును ప్రభుత్వం అమలు చేస్తుంది. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మందికి అందిస్తాం." -తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి