Talasani on Fisheries: స్వరాష్ట్ర సాధన తర్వాత మత్స్య రంగం బలోపేతమవుతూ సంపద పెద్ద ఎత్తున పెరగడం వల్ల మత్స్యకారులకు జీవనోపాధి పెరుగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో జరిగిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఐకాస నేతల సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్, మత్స్య శాఖ కమిషనర్ భూక్యా లచ్చిరాం, పలు జిల్లా గంగపుత్ర, ముదిరాజ్, ఇతర మత్స్యకార సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, నీటి వనరులపై న్యాయపరమైన ఇబ్బందుల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
మత్స్య రంగం బలోపేతం, మత్స్యకారుల సంక్షేమం దృష్ట్యా.. ప్రభుత్వం చేపడుతున్న ఉచిత చేపల పంపిణీ నేపథ్యంలో పెరుగుతున్న మత్స్య సంపద, వనరుల సద్వినియోగంపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు కనీస గుర్తింపు లేదని ప్రస్తావించిన మంత్రి... ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో భారీగా మత్స్య సంపద పెరిగిందని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించాలి... అది పేదలకు పంచాలి అనే విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.