రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలసాని ట్రస్ట్ ద్వారా దాదాపు 55 వేల మంది విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థలు తెరవనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్‌లో విద్యా సంస్థల పునఃప్రారంభంపై జరిగిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తలసాని ట్రస్ట్ ఉదారత.. 55 వేలమంది విద్యార్థులకు మాస్కులు
ఫిబ్రవరి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా మాస్కు, శానిటైజర్ తప్పనిసరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్‌లో తలసాని ట్రస్ట్ ద్వారా దాదాపు 55 వేల మంది విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
విద్యార్థులందరికీ ప్రభుత్వమే మాస్కు, శానిటైజర్లను సమకూరుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మా సొంత పిల్లల్లాగే విద్యార్థులను చూసుకుంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల కోసం 55 వేల మాస్కులు, శానిటైజర్లు మంత్రి తలసాని చేతులమీదుగా డీఈఓ, ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా అధికారికి అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకించి హైదరాబాద్ జిల్లాల్లో విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న చర్యలపై విస్తృతంగా చర్చించారు. విద్యా సంస్థల్లో కరెంట్ బిల్లులు చెల్లించి విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా మంత్రి కేటీఆర్ ట్రాన్స్‌కో ఎండీకి సూచనలు ఇచ్చినట్లు తలసాని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రోహిణి, ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా విద్యాధికారి జయప్రద, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.