కులవృత్తుల వారు ఆత్మగౌరవంతో బతికేలా పాటుపడుతోన్న ఘనత తెరాస (Trs) సర్కారుకే దక్కుతుందని ఆబ్కారీ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో కల్లుగీత కార్మికులకు అభయహస్తం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన, వికలాంగులైన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
మరణించిన గీత కార్మికుల కుటుంబాల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించేందుకు శాఖ తరఫున చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నీరాపాలసీ (Neera Policy), గౌడ కులస్థులే కల్లు గీసేలా ప్రత్యేక జీవో తెచ్చిన ఘనత తమదేనని శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. త్వరలో హైదరాబాద్ కోకాపేటలో గౌడ కులస్థుల సంక్షేమ భవన్ నిర్మాణం చేపడతామని... గీత కార్మికులకు స్పెషల్ డిజైన్ మోపెడ్లను అందజేస్తామని మంత్రి ప్రకటించారు. గౌడన్నలు గౌరవప్రదంగా బతికేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అన్నికులస్థులు ఆత్మగౌరవంతో బతికేలా తమ సర్కారు పాటుపడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. మత్స్యకారులకు వ్యక్తిగత వాహనాలు సమకూర్చినట్లుగా... గీత కార్మికులకు త్వరలో మోపెడ్లు అందజేస్తామన్నారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
మన కొంపల్లి దగ్గర ఒక చెట్టు గీయించినం. ఆ చెట్టుకు 25 లీటర్లు వచ్చింది. 10 మీటర్లు కూడా ఉండని ఆ చెట్టు 25 లీటర్లు ఇచ్చింది ఇది చూసే నీరా పాలసీ తీసుకొచ్చాం. చెట్టుపేరు గిర్కతాళ్ల చెట్టు.. కొబ్బరి చెట్టులా ఉంటుంది. నీరా అమ్మాలన్నా... నీరా గీయాలన్నా కేవలం గౌడ ఈడిగెలు చేయాలని ప్రత్యేక జీవో తీసుకురావడానికి కారణమేందంటే గిర్కతాళ్ల చెట్టుచూడటమే. 10, 20 ఎకరాల పొలమున్న వ్యక్తి గిర్కతాళ్ల చెట్ల నుంచి నీరా సేకరించి బాట్లింగ్ చేస్తే బాగా సేల్ అవుతుంది. గౌడ ఈడిగెలు కాకుండా నీరాను ఎవరైనా అమ్మినా నేరమే... గీసినా నేరమే.
-- శ్రీనివాస్ గౌడ్, ఆబ్కారీ శాఖ మంత్రి
Srinivas Goud: 'వేరే కులస్థులకు ఛాన్స్ లేదు... ఓన్లీ గౌడ్లు మాత్రమే'