Minister Niranjan Reddy: ప్రభుత్వ చర్యల మూలంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలబడిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నాంపల్లి పాఫ్సీ భవన్‌లో "వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు - తెలంగాణ" అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ వీసీ నీరజా ప్రభాకర్, ఫిస్సీ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేశ్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
మంచి విధానం తెస్తే తొందరలోనే అమలు: వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి ఎగుమతులు పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎగుమతులు పెంచడానికి ఏఏ చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై నిపుణులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందజేయాలని సూచించారు. ప్రపంచ మార్కెట్ ఎగుమతులకు అనుగుణంగా ఎలాంటి నిబంధనలు అనుసరించాలో చైతన్యం చేయాలని చెప్పారు. మనకు అత్యంత ప్రతిభ కలిగిన పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారని.. ఒక మంచి విధానం ముందుకు తెస్తే స్వల్ప సమయంలో అమల్లోకి తెచ్చే సత్తా ఆయనకు ఉందని అన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో అత్యధిక మంది ఇష్టపడుతున్న నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దబడిందని స్పష్టం చేశారు. రాష్ట్ర తలసరి ఆదాయం మునుపటి కంటే పెరిగిందన్నారు.