బడ్జెట్ సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆద్యంతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జరిగాయని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉభయసభలు సజావుగా సాగాయని... అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసేలా భారీ బడ్జెట్ను సభలు ఆమోదించాయని వెల్లడించారు.
హుందాతనానికి నిదర్శనం
సభ్యులందరికీ సభాపతులు అవకాశాలిచ్చారని... ప్రతిపక్ష సభ్యులకు అడిగినంత సమయం లభించిందన్నారు. దీనిని బట్టి అసెంబ్లీ సమావేశాలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా సాగాయో తెలుస్తోందని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సభకు అంతరాయం కలిగించకుండా నిర్మాణాత్మక చర్చలకే ప్రాధాన్యత ఇచ్చిన పాలక, ప్రతిపక్ష సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.