niranjan reddy review on inferior seeds : రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో వానాకాలం సాగు కోసం విత్తనాల అంశంపై మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డీజీపీ అంజనీకుమార్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్రంతో సమన్వయం:ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వానాకాలం దృష్ట్యా విత్తనాలు, విత్తన నియంత్రణ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ఈ సమీక్షలో చర్చించారు. వ్యవసాయం బాగుండాలంటే రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలని అన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని రసాయన ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం. ఈ వానా కాలానికి పత్తి, మిరప, కందులు, వరి సహా మిగిలిన అన్ని రకాలు కలిపి 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేశామని తెలిపారు.
అమాయకులను బలి చేయొద్దు:పోటీ ప్రపంచంలో విత్తనాల తయారీలో ప్రైవేటు కంపెనీలదే పైచేయిగా ఉంది. వాటిని నియంత్రించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే నకిలీ విత్తనాలు దాదాపు కనుమరుగయ్యాయని అన్నారు. ఈ విషయంలో టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నంలో అమాయకులను బలిచేయవద్దని ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.