Niranjan Reddy On Suravaram: సాంఘిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ వైతాళికులు, గోల్కొండ పత్రిక సంపాదకులైన ఆయన 126వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న సురవరం విగ్రహానికి నివాళులర్పించారు. భిన్న పార్శ్వాల్లో సమాజాన్ని పరిశీలించిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని మంత్రి పేర్కొన్నారు. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు.. సాహిత్యం నుంచి సైన్స్ వరకు ఆయన సృష్టించిన అంశం లేదన్నారు.
ఆయన సేవలు చిరస్మరణీయం. సురవరం ఆనాడే అన్ని రంగాలను సునిశితంగా పరిశీలించారు. వారికున్న దక్షత సమాజాన్ని ప్రభావితం చేసింది. ఆయన రచనలు సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయి. చరిత్రలో వారికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రచనలు త్వరలోనే మూడో సంపుటాన్ని తీసుకొస్తాం. - నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సాంఘిక అంశాలను సునిశితంగా పరిశీలించి ప్రస్తావించారని మంత్రి తెలిపారు. ఆయన సేవలు మరింత ప్రాచుర్యంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన రచనలను రెండు సంపుటాలుగా తీసుకొచ్చామని... మూడో సంపుటాన్ని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తీసుకొస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సురవరం కుమారుడు కృష్ణ వర్ధన్ రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు.