హాకాభవన్‌లో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ నిపుణులతో సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. పంటల సాగుపై ఈనెల 21న సీఎం కేసీఆర్‌తో సమావేశం ఉంటుందని చెప్పారు. 10 లక్షల ఎకరాల్లో తెలంగాణలో సోనా సాగుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఏఏ జిల్లాలో ఏఏ రకాలు సాగుచేయాలో పంటల మ్యాప్‌ను అధికారలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష
వానాకాలంలో కంది, పత్తిపంటలు ఎక్కువ సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. హాకాభవన్‌లో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ నిపుణులతో సమగ్ర వ్యవసాయ విధానంపై ఆయన సమావేశం జరిపారు.
పంట వేయడం దగ్గర నుంచి అమ్ముకునే వరకు ప్రభుత్వ సూచనలు పాటిస్తే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రైతులు వస్తారని మంత్రి అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సమగ్ర వ్యవసాయ విధానంపై సమావేశం ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ సమావేశాలకు రైతుబంధు సమితి రాష్ట్ర, జిల్లాల అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులు, రాష్ట్ర స్థాయి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు వస్తారని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి :'భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదు'