టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పటినుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తెదేపా మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్నారు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని అప్పుడే తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మల్లారెడ్డి ఆక్షేపించారు.
2012లో వైద్య కళాశాలను ప్రారంభించినట్లు మల్లారెడ్డి చెప్పారు. బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా కళాశాలను స్థాపించినట్లు వెల్లడించారు. వసతి గృహాల్లో దాదాపు 7వేల మంది అమ్మాయిలు ఉంటున్నారన్నారు. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు. తన కళాశాలలు, ఆస్పత్రులుకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని.. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్లు వివరించారు. తాను ఎంపీగా రూ.200 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యాక కూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆక్షేపించారు. పార్లమెంటులో కూడా మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి ప్రశ్నలు వేశారని.. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పిందని వెల్లడించారు.