Minister Mallareddy elder son is slightly unwell: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, అతడి కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు సోదాలు చేస్తోన్న సమయంలో మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి స్వల్ప అస్వస్థత గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయణ్ను తన కుటుంబ సభ్యులు వెంటనే సూరారంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి తన ఇంటిలో సోదాలు నిర్వహిస్తోన్న అధికారులను నెట్టేసి ఆస్పత్రికి వెళ్లి కుమారుడిని పరామర్శించారు. ఆయన వెంటనే ఐటీ అధికారులు వెళ్లారు. కుమారుడిని చూసిన అనంతరం రాజకీయ కుట్రతోనే దాడులకు పాల్పడుతున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తన పెద్ద కుమారుడిని ఇబ్బందిపెట్టడం వల్లే ఛాతి నొప్పి వచ్చిందని వాపోయారు. అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ పోలీసులు తన కుమారుడి ఛాతిపై కొట్టారని మల్లారెడ్డి తెలిపారు. రాత్రంతా హింసిస్తూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ మంత్రిని కాబట్టే తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.
"రాజకీయ కక్షతో బీజేపీ దాడులు చేస్తోంది. దాడుల పేరుతో నా కుమారుడిని ఐటీ అధికారులు కొట్టి, వేధించారు. మేం దొంగ వ్యాపారాలు చేయట్లేదు.. క్యాసినోలు నడిపించడం లేదు.. కావాలనే నాపై ఐటీ దాడులు చేస్తున్నారు. నా కుమారుడిని చూసేందుకు కూడా అధికారులు లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. నిన్న తనను కొట్టడంతో.. ఇప్పటికీ భయంతో వణికిపోతున్నాడు."- మల్లారెడ్డి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి
"నేను కష్టపడి సంపాదించాను. సమాజంలో నిజాయితీగా మెలిగాను. ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగాను. భాజపా దాడులకు భయపడేది లేదు. నా కుమారుడు ఆస్పత్రిలో చేరాడు. ఐటీ అధికారులు దాడులు చేశారేమో అని అనుమానం కలుగుతోంది."- మల్లారెడ్డి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి
ఎమ్మెల్యే వివేక్ పరామర్శ: ఆస్పత్రిలో చేరిన మల్లారెడ్డి పెద్ద కుమారుడిని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. ప్రజల మద్దతుతో గెలిచిన నాయకుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఇప్పుడు చేస్తున్న దాడులకు ప్రతి దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. సూరారంలోని మంత్రి మల్లారెడ్డి కుమారుడిని పరామర్శించడానికి ఎమ్మెల్సీలు రాజు, ఎల్. రమణ వెళ్లారు.
ఇవీ చదవండి: