KTR Davos Tour: ఈ నెల 16 నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు భారీ స్థాయిలో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రభుత్వాధినేతలు, వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థల సారథులు దీనికి హాజరుకానున్నారు. భారత్ నుంచి పలువురు వెళ్లనున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు, సీఈవోలు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాత్రికి స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు.
నిర్వాహకుల ఆహ్వానం మేరకు దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు మంత్రి హాజరు కానున్నారు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం దావోస్‌లో పర్యటించనుంది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, అధికారులు బృందంలో ఉండనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 20 వరకు జరగనున్న సదస్సుకు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.