KTR Tweet about twitter new CEO: ట్విటర్ సీఈవో నియమితులైన పరాగ్ అగర్వాల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థలకు భారతీయులే సీఈవోలన్న మంత్రి... మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎంకు భారతీయులే సీఈవోలగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. తాజాగా ట్విటర్‌కు భారతీయుడే సీఈవో కావడం గర్వకారణమని కొనియాడారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు కొత్త సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ (45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా ఉన్నారు.
ఇదో గౌరవం..
ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్, స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చదువుకున్నారు. తాజా నియామకంపై స్పందించిన ఆయన ‘ఈ పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తా’నని పేర్కొన్నారు. డోర్సీకు కృతజ్ఞతలు చెప్పారు. 'మీ మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరాగ్‌ను ఈ స్థానంలో నిలబెట్టడానికి మూడు కారణాలున్నాయని డోర్సీ అన్నారు.
"కొత్త సీఈఓ కోసం బోర్డు చాలా తీవ్రంగా వెతికింది. చివరకు పరాగ్‌ను ఏకగ్రీవంగా ఎంచుకుంది. అయితే కొంత కాలంగా నా ఎంపిక కూడా అతడే. ఎందుకంటే కంపెనీని, కంపెనీ అవసరాలను అతను లోతుగా అర్థం చేసుకున్నాడు. ప్రతి కీలక నిర్ణయం వెనక పరాగ్ ఉన్నారు. ఈ కంపెనీ ఇలా మారడానికి కారణమయ్యారు. అంతే కాదు.. ఆసక్తి, హేతుబద్ధత, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయి. మనసు పెట్టి పనిచేస్తారు. మా సీఈఓగా నాకు అతనిపై పూర్తి విశ్వాసం ఉంది"
-డోర్సీ