రాష్ట్రానికి చెందిన యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలే లక్ష్యంగా మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు, ఐటీశాఖల అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన మంత్రి... ఆయా రంగాల్లో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు.
టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 11, 569 కంపెనీలకు అనుమతులు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ఇందులో దాదాపు 80శాతం కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయని... సుమారు ఆరు లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు. భవిష్యత్‌లోనూ పెద్దఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధే లక్ష్యంగా... ఉపాధి కల్పన అవకాశాలు ఎక్కువగా ఉన్న టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్‌లో కొరియా దిగ్గజ కంపెనీ యంగ్ వన్ భారీ యూనిట్ ఏర్పాటు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఎలక్ట్రానిక్ రంగంపై ప్రత్యేక దృష్టి...
వేలాది మందికి ఉపాధి కల్పించే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్న కేటీఆర్... బెంగళూరులో సంబంధిత ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. అవసరమైతే ఇతర నగరాల్లో సమావేశాలు నిర్వహిస్తామని, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు, బ్యాటరీ తయారీ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇప్పటికే వన్ ప్లస్, స్కైవర్త్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు.
రాష్ట్రంలో పూర్తవుతోన్న సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి ప్రాధాన్యత దృష్ట్యా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని... ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయిం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడుల ద్వారా వ్యవసాయ రంగానికి భరోసాతో పాటు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కొత్తగా దేశంలోనికి వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆయా రంగాల పరిశ్రమల కోసం అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్, పారిశ్రామిక పార్కుల సమగ్ర సమాచారాన్ని కంపెనీల కోసం అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి: 'నిరుపేదలకు వేగంగా న్యాయసేవలు అందాలి'