జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వర్షాలు, వరదలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిన అపార్ట్‌మెంట్‌లు, కాలనీలకు 24 గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుటకు సమన్వయంతో వ్యవహరించాలని జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖల అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు రూ.297 కోట్లతో పనులు చేపట్టాలని ఆదేశించారు.
వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని వాటర్ వర్క్స్ అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రూ.50 కోట్లతో దెబ్బతిన్న సివరేజి, వాటర్ పైప్‌లైన్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.