KTR: ఐటీలో దేశంలోనే తెలంగాణది ఫస్ట్ ప్లేస్... త్వరలోనే టీ వర్క్స్ - minister ktr latest news
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4వ స్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ఐటీ రంగంలో వార్షిక వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్న కేటీఆర్.. ప్రపంచంలో 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్(HYDERABAD) లోనే ఉన్నాయని వెల్లడించారు. హెచ్ఐసీసీలో ఐసీటీ(ICT) నూతన పాలసీ విధానాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.
KTR: ఐటీలో దేశంలోనే తెలంగాణది ఫస్ట్ ప్లేస్... త్వరలోనే టీ వర్క్స్
By
Published : Sep 16, 2021, 1:37 PM IST
|
Updated : Sep 17, 2021, 4:45 AM IST
రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణ, భవిష్యత్తు టెక్నాలజీలతో మెరుగైన సత్వర పౌరసేవలే లక్ష్యంగా తెలంగాణ ఐటీ విధానం 2021-2026 విడుదలైంది. వచ్చే ఐదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కార్యకలాపాలను విస్తరించనుంది. టీ-ఫైబర్ ద్వారా నూరు శాతం ప్రభుత్వ సంస్థలు, గ్రామీణ, పట్టణ గృహాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. గురువారం మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నాస్కామ్, యాక్సెంచర్ ఛైర్‌పర్సన్ రేఖామీనన్, సైయంట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీసీఎస్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజన్న, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్ మ్యాన్, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కొత్త ఐటీ విధానాన్ని విడుదల చేశారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ విధానం ప్రతులను వేదికపైకి చేర్చారు. వచ్చే అయిదేళ్లలో ఐటీ ఎగుమతులను 3లక్షల కోట్లకు పెంచాలని, రూ.85 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఐటీలో రూ.3.5 లక్షలు, ఎలక్ట్రానిక్స్‌లో 3 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్‌లో రూ.75 వేల కోట్లు, అలాగే 8 వేల అంకురాల ద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు సమీకరిస్తామని చెప్పారు. ఐటీ ఉత్పాదకత అభివృద్ధి, ఇంజినీరింగు, పరిశోధన, అభివృద్ధిలో తెలంగాణను ప్రపంచస్థాయి కేంద్ర స్థానం (గ్లోబల్ హబ్)గా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ సేవలు విస్తరిస్తామని, 40 స్మార్ట్ పట్టణాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
సామాన్యులందరికీ...
‘‘ఏ సాంకేతికత అయినా సామాన్యులందరికీ అందుబాటులో ఉండాలని, వారి అవసరాలను తీర్చాలనే సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. గత అయిదేళ్లలో 2.5 శాతం కంటే ఎక్కువగా ఎగుమతులు జరిగాయి. భారతదేశంలో 7% ఉత్పత్తి తెలంగాణలోనే జరుగుతోంది. డ్రోన్ల సాంకేతికతలోనూ ముందంజలో ఉన్నాం. ఈ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు ఔషధాల పంపిణీని చేపట్టాం. మరిన్ని సేవలను విస్తరిస్తాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిస్తాం. రాష్ట్ర ప్రగతిలో పారిశ్రామికవేత్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. పారిశ్రామికంగానే గాక రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ముందున్నారు ’’ అని మంత్రి కేటీ రామారావు తెలిపారు. వివిధ రంగాల్లో ఐటీ సేవలకు గాను జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.
62 వేల ఉద్యోగాలతో టీసీఎస్ ప్రథమ స్థానం
తెలంగాణలో 62 వేల ఉద్యోగాలతో టీసీఎస్ ప్రథమ స్థానంలో ఉందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. రాజన్నను మంత్రి కేటీఆర్ అభినందించి జ్ఞాపికను అందజేశారు. జాతీయ అడిక్టివ్ (త్రీడీ ప్రింటింగ్) కేంద్రాన్ని (ఎన్‌కామ్‌ను), స్టార్టప్ తెలంగాణ పోర్టల్‌ను మంత్రి, ఆహూతులు ప్రారంభించారు.
జీడీపీ:దేశ జీడీపీలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది.
ఐటీ:ఐటీ రంగం వార్షిక వృద్ధిలో రాష్ట్రానిది మొదటి స్థానం.
ఐటీ ఎగుమతులు:తెలంగాణ ఏర్పడిన నాటికంటే ఐటీ ఎగుమతులు దాదాపు రెండింతలయ్యాయి. 2013-14లో రూ.57 వేల కోట్లుగా ఉండగా 2020-21 నాటికి రూ.లక్షా 45 వేల కోట్లకు పెరిగాయి.
తలసరి ఆదాయం: 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రూ.1.24 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ.2.37 లక్షలకు చేరింది. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువగా ఉంది.
ఆసరా: టీహబ్, టీఎస్‌ఐసీ, రిచ్, వీహబ్, టీవర్క్స్‌ల ద్వాజురా 1,500 అంకురాలకు వ్యవస్థాపన సౌకర్యాలతో పాటు రూ.1,800 కోట్ల మేరకు సాయం అందించాం.
ఉద్యోగిత: ప్రపంచంలో అత్యున్నత ఐదు కంపెనీలు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాలను నెలకొల్పాయి. అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఐటీ రంగంలో 6.5 లక్షల మంది పనిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో మరో 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. టాస్క్ ద్వారా మూడు లక్షల మందికి పైగా నిపుణులను తయారు చేశాం.
డిజిటల్ విద్య: గ్రామీణ ప్రాంతాల్లోని 5 లక్షల మందికిపైగా డిజిటల్ విద్యనందించాం. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 డిజిటల్ తెలంగాణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. పంచాయతీల స్థాయిలో పౌరులకు డిజిటల్ సేవలను అందించడానికి ప్రతి కుటుంబంలో ఒకరికి, స్వయం సాధికార సంఘాలలో ఒక్కొక్కరికి డిజిటల్ శిక్షణ అందిస్తాం.
- మంత్రి కేటీఆర్
ఐటీలో కొత్త నైపుణ్యాలు రావాల్సిందే
తెలంగాణలో కొత్త విధానం బాగుందని, ఐటీలో కొత్త నైపుణ్యాలు రావాల్సిందేనని ఆహూతులు పేర్కొన్నారు. ఐటీ రంగంలో నవీన సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని నాస్కామ్ ఛైర్‌పర్సన్ రేఖా మీనన్ పిలుపునిచ్చారు. కృత్రిమమేధ, రోబోటిక్స్ వంటి వాటిదే భవిష్యత్తు అని, ఈ కోణంలో తెలంగాణ ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. కొత్త విధానంలో నైపుణ్యాలకు పెద్దపీట వేయడం బాగుందని సైయంట్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, నిబద్ధత కొత్త విధానంలో ప్రతిబింబిస్తోందని టీసీఎస్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజన్న పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్ మ్యాన్ మాట్లాడుతూ... తెలంగాణ, అమెరికాల మధ్య పారిశ్రామిక సంబంధాలు దృఢంగా ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆధ్వర్యంలో తెలంగాణ అప్రతిహతంగా పురోగమిస్తోందని తెలిపారు.
ఆవిష్కరణలపై పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక సిలబస్
ఈనాడు, హైదరాబాద్: పాఠశాలల నుంచే విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సాహించేందుకు పాఠ్యప్రణాళికలో ప్రభుత్వం ప్రత్యేక సిలబస్ చేర్చనుంది. ఏటా 50వేల మంది విద్యార్థులకు సాఫ్ట్‌వేర్, భవిష్యత్తు టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వనుంది. ఐటీ ఉద్యోగులకు సాఫ్ట్‌స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ కోర్సులు సిద్ధం చేయనుంది. ఐదు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. నూతన ఐటీ విధానంలో ప్రభుత్వం ఈ విషయం స్పష్టం చేసింది. రానున్న ఐదేళ్లలో జీవశాస్త్రాలు, ఆరోగ్యపరిరక్షణ, రిటైల్, ఆర్థిక సేవలు, ఇంధనం, టెలికం తదితర రంగాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, వీటిల్లో డిజిటల్ ఆధారిత సేవలపై దృష్టిపెట్టనున్నట్లు వివరించింది.
పెట్టుబడిదారులకు సులువుగా
పెట్టుబడుల విధానం, ప్రభుత్వ సహాయ సహకారాలు, సత్వర అనుమతుల కోసం త్వరలో ఐటీశాఖ పెట్టుబడిదారుల సమాచార పుస్తకం (ఇన్వెస్టర్ ప్లేబుక్) ఆవిష్కరిస్తుంది. సీఆర్‌వో కార్యాలయాలాన్ని సంప్రదిస్తే చాలు మొత్తం పనులన్నీ అయ్యేలా వెసులుబాటు కల్పిస్తుంది. స్టార్టప్‌లకు నిధులు సమకూర్చేందుకు వీలుగా పెట్టుబడి సంస్థలతో వ్యవస్థ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో ఐదు లక్షల చ.అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం కలిగిన కేంద్రాన్ని ప్రభుత్వం తొలిదశలో ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో మరో 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఎలక్ట్రానిక్ కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయనుంది. ఇమేజ్ టవర్‌లో కొత్తగా 16 లక్షల చ.అ. విస్తీర్ణం, జీనోమ్‌వ్యాలీలో లైఫ్‌సైన్సెస్‌కు లక్ష చ.అ. విస్తీర్ణంతో మౌలిక సదుపాయాలు కల్పించనుంది. ‘‘పారిశ్రామిక పార్కుల్ని ఐటీపార్కులుగా బదిలీచేసేప్పుడు 60 శాతం స్థలాన్ని ఐటీ కార్యాలయాలకు కేటాయించాలి. అలాగే ఐటీ పార్కుల్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రించేందుకు నిర్మిత స్థలంలో 40 శాతం పార్కింగ్ స్థలంగా కేటాయించాలి’’ అని ప్రభుత్వం పేర్కొంది.
ఇంటి నుంచే పౌరసేవలు...
ప్రభుత్వ సేవలు పొందేందుకు అధికారులను కలవాల్సిన అవసరం, కాగితంతో పని లేకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీలైన ఏఐ, ఎంఎల్, బ్లాక్‌చైన్‌తో మరిన్ని సేవలను డిజిటల్ పరిధిలోకి తీసుకురానుంది. పౌరసేవలకు సంబంధించి ఫిర్యాదులపై జనహిత పేరిట పరిష్కార కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రత్యేక కాల్‌సెంటర్ అందుబాటులోకి రానుంది.