Minister KTR Open Letter To Central Govt : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరిత వైఖరి కనబరుస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రగతి, పురోగతిని ఓర్వలేక తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాన్ని తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తోందని ఆక్షేపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో లేఖ రాస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించేలా ప్రధాని మోదీ స్వయంగా పలుమార్లు మాట్లాడారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురైన అన్ని ఆటంకాలను దాటుకొని.. తనదైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతోందని వివరించారు. అయితే రాష్ట్ర ప్రగతిని, పురోగతిని ఓర్వలేని కేంద్రం.. తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాన్ని గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తూనే ఉందని కేటీఆర్ మండిపడ్డారు.
KTR Comments On Central Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదుల ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంశంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుకు రెండోదశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా పక్కనపెట్టిన కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ లేఖలో తెలిపారు.