Minister Ktr in brs public meeting ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాడే నిజమైన నాయకుడని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దఅంబర్ పేటలో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నిర్వహించారు. 63 రోజుల పాటు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు పాదయాత్ర చేశారు. 95 గ్రామాల మీదుగా 775 కి.మీ. మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి పాదయాత్ర చేయగా.. పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ప్రధానంగా 10 సమస్యలను ప్రశాంత్‌రెడ్డి తన దృష్టికి తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాడే నిజమైన నాయకుడని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వ లబ్ధి చేకూరేలా చూడాలని సీఎం చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే పరిపాలన పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందన్న కేటీఆర్.. స్వచ్ఛ గ్రామాలు, ఉత్తమ మున్సిపాలిటీ కేటగిరీల్లో రాష్ట్రానికే అధిక అవార్డులు వచ్చాయన్నారు.
రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.10 లక్షలకు పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 200 ఎకరాల్లో ఫాక్స్‌కాన్ పరిశ్రమ ఏర్పాటు కానుందని వెల్లడించారు. కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మరోసారి తెలిపారు. తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయని అపోహలు సృష్టించారని.. ఇప్పుడు హైదరాబాద్, పరిసర జిల్లాలు, ఇతర జిల్లాల్లో భూములు ధరలు పెరిగాయని స్పష్టం చేశారు.