KTR in Assembly: అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ మూడోరోజు సుదీర్ఘంగా కొనసాగింది. విద్య, వైద్య, పురపాలక, పర్యాటక, క్రీడా, దేవాదాయ, అటవీ, కార్మికశాఖకు సంబంధించిన పద్దుపై చర్చించారు. పురపాలిక శాఖకు సంబంధించి వివిధ అంశాలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. పక్కా ప్రణాళిక ప్రకారం మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నామన్న మంత్రి.. 141 పురపాలికలకు 3 వేల 809 కోట్లు మంజూరు చేశామన్నారు. 67 ఏళ్లలో కాంగ్రెస్ చేయని పనులను చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనూ మౌలిక వసతులపై దృష్టి సారించామన్న కేటీఆర్.. త్వరలోనే ఎలివేటెడ్ బీఆర్టీఎస్ వ్యవస్థ తీసుకువస్తున్నామని ప్రకటించారు.
పోడు సమస్యలపై చర్చ
పోడు భూముల సమస్యపైనా కాంగ్రెస్ పలు అంశాలను లేవనెత్తింది. పోడు సమస్యకు త్వరగా శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. ట్రెంచ్‌ల పేరుతో అడ్డువచ్చిన గిరిజనులను అధికారులు కొడుతున్నారని సీతక్క వివరించారు. ఇందుకు స్పందించిన అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. ఈ విషయంలో సీఎం హామీని తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కచ్చితంగా పరిష్కారం చూపుతామని పునరుద్ఘాటించారు. దరఖాస్తులు అనుకున్న దాని కంటే ఎక్కువగా వచ్చాయని... గిరిజన సంక్షేమ శాఖ వాటన్నింటినీ పరిశీలించి పరిష్కరిస్తోందని పేర్కొన్నారు.