Minister KTR Meeting With Press Editors in Hyderabad : తొమ్మిదిన్నరేళ్లలో నికరంగా ఆరున్నరేళ్లు పని చేశాం.. శిథిలావస్థలో, విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని 2014 జూన్లో మాకు అప్పగించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందోనని శ్రీకృష్ణ కమిటీకూడా చాలా అనుమానాలు వ్యక్తం చేసిందని తెలిపారు. కానీ ఇప్పుడు 75 ఏళ్ల భారతదేశంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. నాటి నుంచి నేటి వరకు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి తెలంగాణ నమూనాగా ఎంచుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్లో పత్రికా సంపాదకులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముగ్గురు సీఎంలు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ తమదైన ముద్ర వేశారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. రాష్ట్రంలో ఆల్రౌండ్ అభివృద్ధి జరిగిందని హర్షించారు. వినూత్న కార్యక్రమాలను(Telangana Schemes) ఎన్నో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని వివరించారు. ఇప్పుడు ఎన్నికలో ప్రభుత్వం మారాలని.. తప్పనిసరిగా మార్పు రావాలని కొందరు అంటున్నారని.. అయినా ఎందుకు మార్పునని కేటీఆర్ ప్రశ్నించారు.
Telangana Assembly Elections 2023 :ఈ ఎన్నికల్లో మార్పు ఆర్నెళ్లకో మారు సీఎం మార్పు కోసమా? విద్యుత్ కోతల కోసమా? స్కీంలు పోయి స్కాంల కోసమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయం దండుగ చేసి రైతులు ఆత్మహత్యల కోసమా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు కావునే 2014లో బీఆర్ఎస్(టీఆర్ఎస్)కు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. గుజరాత్లో ఐదు దఫాలు బీజేపీ.. 55 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలోకి కాంగ్రెస్ లేదా అంటూ విమర్శలు చేశారు. దశాబ్దాలు పాలించి విఫలమైన వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. ఒక్కసారి జరిగిన తప్పునకే దశాబ్దాలుగా తెలంగాణ గోస పడిందని.. మళ్లీ ఆ తప్పు జరగవద్దన్నారు.