వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్లో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. సుమారు 50కి పైగా ముఖాముఖి సమావేశాలకు హాజరయ్యారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా మంత్రి ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోకా కోలా సీఓవో జేమ్స్ క్వేన్సీ , సేల్స్ ఫోర్స్ స్థాపకుడు ఛైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కికి లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశం అయ్యారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ అగ్రస్థానం...
తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల విధానాలను, పారిశ్రామిక పాలసీని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను, వివిధ పరిశ్రమలకు ఇక్కడ అందుబాటులో ఉన్న వసతుల గురించి కేటీఆర్ వివరించారు. రాష్ట్రం ఏ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలుస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు.
గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం శీఘ్ర గతిన అభివృద్ధి చెందుతున్న తీరుని మంత్రి వివరించారు. ఇక్కడి కాస్మోపాలిటన్ కల్చర్ని మరియు గత కొన్ని సంవత్సరాలుగా జీవించేందుకు అనువుగా ఉన్న నగరాల్లో అత్యుత్తమ నగరంగా ఎంపిక అవుతున్న విషయాన్ని సదస్సుల్లో చెప్పుకొచ్చారు.