KTR On BJP Corporators GHMC Protest: జీహెచ్ఎంసీ కార్యాలయంపై భాజపా కార్పొరేటర్లు మంగళవారం చేసిన దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. భాజపాకు చెందిన పోకిరీలు, దుండగులు కార్యాలయంలో దాడిచేశారన్న మంత్రి... ఇలాంటి చర్యలు సరికావన్నారు. గాడ్సే అభిమానులను గాంధీ మార్గంలో నడవమని కోరటం అత్యాశే అవుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.... దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీని కేటీఆర్ కోరారు. ఈ దాడి ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు.
ఏం జరిగింది?
హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ... మేయర్ ఛాంబర్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం (BJP corporators besiege GHMC headquarters) ఏర్పడింది. కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని, కార్పొరేటర్ల ఫండ్ విడుదల చేయాలని భాజపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా... పనులు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదని కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని... లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.