KTR on Fuel Prices: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నందున ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెట్రో సుంకాలను పూర్తిగా ఎత్తేస్తే ప్రతి లీటర్ పైనా ప్రజలకు దాదాపుగా 30 రూపాయల వరకు ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రజలపై భారం వేసేందుకు చట్టాన్ని కూడా సవరించి.. పెట్రోల్, డీజీల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్ఠంగా పెంచుకొని ప్రజలపై భారం వేసేలా 2020లో కేంద్రం చట్టాన్ని కూడా సవరించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఓ వైపు సెస్సులు, సుంకాల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్న మోదీ సర్కారు.. అ నెపాన్ని రాష్ట్రాలపై నెడుతోందని మండిపడ్డారు. పన్నుల రూపంలో ఇప్పటిదాకా మెత్తం 26 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి గుంజుకుందని కేటీఆర్ ధ్వజమెత్తారు
భారీగా సుంకాల పెంపు:పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడిచమురు ధరలు కారణమంటూ కేంద్రం చేస్తున్న వాదనలో ఎలాంటి నిజం లేదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్యారెల్ ముడి చమురు ధర భారీగా తగ్గుతున్నప్పటికీ.. దేశంలో పెట్రో రేట్లు మాత్రం పెరుగుతూ పోతున్నాయని తెలిపారు. ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం దేశ ప్రజలకు ఇవ్వాల్సి వస్తుందేమోనన్న దుర్భుద్దితో కేంద్రం ఎక్సైజ్ సుంకాలను, సెస్సులను భారీగా పెంచుతోందని కేటీఆర్ మండిపడ్డారు.
ధరల నియంత్రణలో మోదీ విఫలం: బ్యారెల్ ధర తగ్గినా పెట్రో రేట్ల పెరుగుదల గత కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని అధికారంలోకి రాకముందు ఆరోపించిన నరేంద్ర మోదీ.. ధరల నియంత్రణలో ఘోరంగా విఫలమయ్యారని ఒప్పుకుంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2014లో బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 110 డాలర్లుగా ఉండేదని, 2015లో 50 డాలర్లకు, 2016లో 27 డాలర్లకు.. 2020లో ఏకంగా 11 డాలర్లకు పడిపోయిందన్నారు.
కేంద్ర సంస్థల గణాంకాల ప్రకారం మోదీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లలోనే పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 54 శాతం పెరిగితే, డీజిల్ మీద ఏకంగా 154 శాతం పెరిగిందన్నారు. పెట్రో ధరలను పెంచి ప్రజల నుంచి భారీగా వసూలు చేసిందని ధ్వజమెత్తారు. కొవిడ్ మహమ్మారితో ఓ వైపు దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోయిన సమయంలో కనికరం లేకుండా మోదీ సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోయిందన్నారు. మోదీ సర్కారు 2020 నాటికే ఎక్సైజ్ డ్యూటీ రూపంలోనే సుమారు 14 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.