Christmas celebrations in Telangana: ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనున్న క్రిస్మస్ వేడుకల నిర్వహణ, క్రైస్తవ భవన నిర్మాణాల పనులపై అధికారులు, క్రైస్తవ వర్గాల ప్రతినిధులు, అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈనెల 21 లేదా 22వ తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆయన ప్రకటించారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపిన ఆయన.. క్రైస్తవ భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. క్రిస్మస్ ముందే ఉప్పల్ భగాయత్ పరిధిలో 2 ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరులకు ప్రత్యేక శుభకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల.. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని రాష్ట్రంలో క్రైస్తవ సోదరిమనులకు పంపిణీ చేయబోయే దుస్తులను విడుదల చేశారు.