Minister HarishRao Review On Heavy Rains : రాష్ట్రవ్యాప్తంగా ఆకాశానికి చిల్లు పడిందన్నట్లు.. ఎడతెరుపు లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పలు జిల్లాల్లో మోహరించారు. విద్యుత్ శాఖ ఇంజినీర్లకు సెలవులను కూడా రద్దు చేసింది. హైదరాబాద్‌లో ఆగకుండా పడుతున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అయింది. ఈ పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు, సీఎస్ శాంతికుమారి, విద్యుత్ శాఖ సీఎండీ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అవసరం అయితే హెలికాప్టర్ వాడుతామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఎడతెరపి లేని వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశించారు. ప్రజలకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాల సమయంలో కలుషిత నీరు, ఆహారం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువన్న మంత్రి .. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాము, తేలు కాటు మందులను తప్పక అందుబాటులో ఉంటాలని హరీశ్‌రావు ఆదేశించారు.
- Telangana Rains : తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. పొంగుతున్న వాగులు.. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి
రానున్న 48 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు : రానున్న 48 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. వివిధ శాఖల ఉన్నతాధికారులు, సంబంధింత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. వర్షాలపై ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో, సహాయపడేందుకు వీలుగా వరంగల్, ములుగు, కొత్తగూడెంలలో ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉంచామని.. హైదరాబాద్‌లోనూ 40 మందితో కూడిన ఒక బృందం సిద్ధంగా ఉందని ప్రధాన కార్యదర్శి తెలిపారు.