Harish Rao on Jobs: గత శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఈ సీజన్లో జరిగిన ప్రతిసారీ ప్రతిపక్ష సభ్యులు ఎండిన ధాన్యంతో నిరసన వ్యక్తం చేసేవారని.. ప్రస్తుత సభలో అలాంటి సమస్యలపైనే సభ్యులు చర్చించడంలేదంటే... అది ప్రభుత్వ విజయమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గ్రామాల్లోకి ప్రజాప్రతినిధులు వెళితే..ఖాళీ బిందెలతో మహిళలు, ఎరువుల కోసం రైతులు నిరసన తెలిపేవారని మంత్రి హరీష్ రావు గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క గుంట కూడా ఎండలేదన్నారు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి వలసలు వెళితే.. ఇప్పుడు 11 రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వస్తున్నారన్నారు. శాసన మండలిలో బడ్జెట్ పై చర్చ జరగగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.
అప్పుడు ఏం చేశారు..?
వ్యవసాయానికి తక్కువ నిధులు కేటాయించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించగా.. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్లలో రూ.7,994 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయిస్తే... తెరాస ప్రభుత్వం ఒక్క ఏడాదిలో ఒక్క రైతుబంధుకే రూ.14,400కోట్లు ఖర్చు చేసిందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలు ఆడడంలో భాజపాను మించిన వారు లేరని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బిస్వాల్ కమిటీ 54,000ల పోస్టులను జీరోగా చూపించిందన్నారు. రాష్ట్రంలో 4,36,140 ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా అందులో 2,99,600ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని.. ప్రస్తుతం 1,36, 534 వరకు ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 87,880 ఉద్యోగాల నియామకంపై ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. ఇప్పటికే 1,32,000ల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందని మంత్రి హరీష్ రావు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.7వేల కోట్ల భారం పడుతుందన్నారు. బడ్జెట్లో రూ.2 వేల కోట్లు అందుకోసం కేటాయించామని తెలిపారు.
కేంద్రం ఉద్యోగ ప్రకటన చేయాలి..
భాజపా ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను ప్రకటిస్తామని చెప్పిందని.. ఆ లెక్కన ఏడేళ్లలో 15 కోట్ల ఉద్యోగాల ప్రకటన చేయాల్సి ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15.62 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే శాఖలో 3లక్షల ఉద్యోగాలు, బ్యాంకింగ్ సెక్టార్ లో 41వేల ఉద్యోగాలు, 25శాతం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కలిపితే సుమారు 9 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏకైక రాష్ట్రం తెలంగాణనే..
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తూనే.. మరోపక్క సొంత స్థలం ఉన్నవారికి నియోజకవర్గానికి 3వేల చొప్పున ఒక్కో లబ్ధిదారుడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.3లక్షల నిధులను అందజేస్తుందన్నారు. విద్యుత్ రంగానికి కాంగ్రెస్ హయాంలోని పదేళ్లలో రూ.14,423 కోట్లు ఖర్చుపెడితే... తెరాస ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో 43,574 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అప్పు చేసే రాష్ట్రాల్లో కింది నుంచి తెలంగాణ ఐదవ స్థానంలో ఉందన్నారు. గడిచిన 60 ఏళ్లలో మూడు మెడికల్ కళాశాలలు అందుబాటులోకి తీసుకువస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఏడేళ్లలో 12 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే మూడేళ్లలో ఏడాదికి 8 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. సొంత ఆదాయ వనరుల ద్వారా వచ్చే సంపదానలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
కేంద్రం వివక్ష చూపిస్తోంది: జీవన్ రెడ్డి
కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందని.. కేంద్రం నుంచి సాయం ఉంటే రాష్ట్రానికి మరింత వెసులుబాటు వచ్చేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ఉన్నమాదిరిగానే భాజపా ద్వంద వైఖరి అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు. పోలవరం ముంపు సంబంధం లేని మండలాలను ఆంధ్రలో కలిపారన్నారు. ఏడేళ్లు తెరాస కేంద్రంతో సన్నిహితంగా ఉందని... ఇప్పటికైనా భాజపా నుంచి బయటకు వచ్చినందుకు అభినందిస్తున్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన బాధ్యతల నుంచి వైదొలగిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు.
తెరాస ప్రభుత్వం సొంత స్థలం ఉన్న వారికి మూడు లక్షలు అందజేస్తున్న దాంట్లో కేంద్రం ఇస్తున్న వాటా రూ.2.50 లక్షలు ఉన్నాయా...? ఉంటే ఆ వివరాలు తెలపాలన్నారు. దానిపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చే నిధులు అందరికి వర్తించడం లేదని.. ఎస్.ఈ.ఎస్ (సోసియో ఎకనామిక్ స్టేటస్)లో ఉన్న వారికి మాత్రమే ఆ డబ్బులు వస్తాయన్నారు. మధ్యాహ్న భోజన పథకంకు నిధులు పెంచాలని..పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. బడ్జెట్ నిధులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కాకుండా బిడ్డ సొమ్ము తల్లిదండ్రులకు ఇచ్చినట్టు ఉండాలన్నారు.
సోమవారంకు వాయిదా
బడ్జెట్ పై చర్చ-ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సమాధానం పూర్తికాగానే శాసన మండలిని సోమవారంకు వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం ఛైర్మన్ ప్రకటించారు.
ఇదీ చదవండి: