Harish rao on Medical Colleges: వైద్య కళాశాలల ప్రతిపాదనల విషయంలో పార్లమెంటు, దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కొత్త వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదని పదేపదే అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు. పార్లమెంటు సాక్షిగా గోబెల్స్ ప్రచారానికి దిగిందని మండిపడ్డారు. మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని చెప్పిన కేంద్రం.. ఇవాళ వైద్య కళాశాలల ఏర్పాటుపైనా లోకసభ వేదికగా దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో చెప్పడం బాధాకరమన్నారు. వైద్య కళాశాలలు మంజూరు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఒక్కటీ ఇవ్వకపోవడమే కాకుండా పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉందని మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని హరీశ్‌రావు తెలిపారు.