పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
పల్లెప్రగతి పనులు రానున్న 2 నెలల్లో పూర్తి చేయాలి: ఎర్రబెల్లి - Minister Errabelli Dayakar Rao latest news
రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ 2 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన పల్లెప్రగతి దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతోందన్న ఆయన... చేపట్టిన ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, కల్లాలు, రైతువేదికలు, మొక్కల పెంపకం సహా అన్నీ సజావుగా అమలు కావాలని స్పష్టం చేశారు.
నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతువేదికలు సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని, లక్ష కల్లాల పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను పూర్తి చేసి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలని, వైకుంఠధామాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా అన్నింటికీ మంచినీరు తీసుకోవాలన్న మంత్రి... ఆయా నిర్మాణాల చుట్టూ ప్రహరీలుగా ఏపుగా పెరిగే మొక్కలను నాటాలని తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలన్నీ కచ్చితంగా బతికి తీరాలని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని సమస్యలుంటే పరిష్కరించుకోవాలని ఎర్రబెల్లి అధికారులకు సూచించారు.